![]() |
ఈర్ష్యా, అసూయ, ద్వేషాలు ఏ రంగంలోనైనా ఉంటాయి. ఆయా రంగాల్లో ఎదుగుతున్న వారిని చూసి మిగతా వారు అసూయ పడడం సహజం. సినిమా రంగం విషయానికి వస్తే.. అక్కడ కూడా ఈ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. కానీ, వాటికి అతీతంగా స్నేహబంధాన్ని కొనసాగించిన వారు కూడా ఎంతో మంది ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారిలో మొదటగా చెప్పుకోవాల్సిన వారు ఎన్టీఆర్, ఎఎన్నార్. కెరీర్‌పరంగా ఎన్టీఆర్ కంటే ఎఎన్నార్ చాలా సీనియర్. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చే నాటికి కీలుగుర్రం, బాలరాజు వంటి జానపద చిత్రాలతో స్టార్ హీరో రేంజ్‌లో ఉన్నారు ఎఎన్నార్. ఎప్పుడైతే ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి విడుదలై ఘనవిజయం సాధించిందో.. అప్పుడే ఎఎన్నార్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ విషయంలోనైనా తను ఎన్టీఆర్ కంటే తక్కువే. కాబట్టి జానపద చిత్రాల జోలికి వెళ్ళకుండా సాంఘిక చిత్రాల్లోనే ప్రయోగాత్మక సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అలా ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు, సక్సెస్ అయ్యారు.
వృత్తిపరంగా పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఎంతో స్నేహంగా ఉండేవారు ఎన్టీఆర్, ఎఎన్నార్. ఎన్టీఆర్‌ను తన పెద్ద కొడుకుగా భావించేవారు ఎఎన్నార్ తల్లి. అలా వారి కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉండేది. ఇద్దరూ స్టార్ హీరోలు అయినప్పటికీ ఒకరి సినిమాలో మరొకరు నటించడానికి ఏమాత్రం ఇబ్బంది పడేవారు కాదు. ఉదాహరణకు ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన మిస్సమ్మ చిత్రంలో ఏమాత్రం ప్రాధాన్యం లేని ఒక కామెడీ క్యారెక్టర్ చేశారు ఎఎన్నార్. దానికి కారణం.. అప్పటివరకు జానపద సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న ఎఎన్నార్.. సాంఘిక చిత్రాల్లో నటించడానికి పనికిరాడు అనే అభిప్రాయం అందరిలోనూ ఉండేది. అది నిజం కాదు అని ప్రూవ్ చేసేందుకే మిస్సమ్మ సినిమాలో డిటెక్టివ్ రాజు క్యారెక్టర్ చేశారు. ఆ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించి అందర్నీ మెప్పించారు. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్, ఎఎన్నార్ కలిసి చాలా సినిమాల్లో నటించారు.
వీరి తర్వాత అంత మంచి స్నేహితులు అనిపించుకున్నవారు కృష్ణ, శోభన్‌బాబు. వీరిద్దరిలో కృష్ణ కంటే శోభన్‌బాబు సీనియర్. కృష్ణ హీరోగా నటించిన గూఢచారి 116 చిత్రంలో ఏమాత్రం ప్రాధాన్యం లేని ఒక క్యారెక్టర్ చేశారు శోభన్‌బాబు. అప్పటికే దాదాపు 30 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత వీరి స్నేహబంధం బాగా బలపడింది. కృష్ణ ఎక్కువగా శోభన్‌బాబు ఇంట్లోనే ఉండేవారు. కృష్ణ తల్లిదండ్రులు శోభన్‌ను పెద్ద కొడుకుగా భావించి పెద్దబ్బాయ్ అని పిలిచేవారు. అప్పుడు మొదలైన వీరి స్నేహం చివరి వరకు కొనసాగింది. వీరికి సంబంధించిన మరో విశేషం ఉంది. వాస్తవానికి కృష్ణ, శోభన్‌బాబు మధ్య బంధుత్వం కలవాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.
సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు శోభన్‌బాబు ఇంట్లోనే ఇద్దరూ కలుసుకునేవారు. గంటల తరబడి తమ వ్యక్తిగత విషయాలు, సినిమాలకు సంబంధించిన విశేషాలు మాట్లాడుకునేవారు. అలా వాళ్లింటికి కృష్ణ తరచూ వెళ్లేవారు. ఆ సమయంలో శోభన్‌బాబు మరదలు అతని ఇంట్లోనే ఉండేవారు. తన మరదల్ని కృష్ణకి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నారు శోభన్‌బాబు. ఈ విషయంలో కృష్ణ తల్లి అభ్యంతరం చెప్పారు. ‘నాకు కాబోయే కోడలు మా అబ్బాయిలాగే తెల్లగా ఉండాలి. నీ మాట కాదన్నందుకు ఏమీ అనుకోవద్దు’ అని అన్నారామె. ఈ సంఘటన స్నేహితుల మధ్య దూరాన్ని ఏమాత్రం పెంచలేకపోయింది. అవన్నీ మనసులో పెట్టుకోకుండా చివరి వరకూ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉన్నారు.
![]() |